ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సమాజ సేవలో మేము ముందే ఉంటాం.. : ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌.

ప్రభుత్వంపై నియంత్రణ లేదన్న మోహన్‌ భగవత్‌..

R9TELUGUNEWS.COM: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) ప్రభావం ఏమీ లేదని సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వ్యక్తులు సంఘ్‌కు చెందినవారైనప్పటికీ మీడియా పేర్కొంటున్నట్లు ప్రభుత్వంపై తమ సంస్థ ప్రభావం, నియంత్రణ ఉండదని స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నలభైవేల ఏళ్ల క్రితం, ఇప్పటి ప్రజల డీఎన్‌ఏ ఒకటేనని అన్నారు.ప్రభుత్వాలు మాకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తాయి. ఎప్పుడూ మాపై విమర్శలు వస్తాయి. అయినప్పటికీ ఎంతో మంది స్వయంసేవకులు సమాజసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ గత 96 ఏళ్లుగా సంఘ్‌ కొనసాగుతోంది. ఎటువంటి ప్రచారం, ఆర్థిక వనరులు, ప్రభుత్వం సహకారం లేకున్నా నిరంతరం సమాజహితం కోసమే సంఘ్‌ పనిచేస్తోంది’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ‘40వేల ఏళ్ల క్రితం దేశ ప్రజలందరి డీఎన్‌ఏ ఇప్పటి ప్రజలది ఒకటే. మన పూర్వికులందరూ ఒక్కటే. వారివల్లే మన దేశం అభివృద్ధి చెందింది. అంతేకాకుండా మన సంస్కృతి కూడా కొనసాగుతోంది’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతో సహా ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు.