ఉక్రెయిన్ వీడాలంటూ భారతీయులకు సూచన..మూడు రోజులపాటు ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు..

ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా మూడు రోజులపాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి తరలించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దవాతావరణం () నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థిని గమనిస్తోన్న మోదీ సర్కార్ మంగళవారం అక్కడి భారతీయులకు కీలక సూచన చేసింది. ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు వీలైతే దేశాన్ని వీడాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్స్ లోని ఇండియన్ ఎంబసీ (Embassy of India, Kyiv) ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది…భారత్ కంటే ముందే పలు దేశాలు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను వెనక్కి వచ్చేయాలని పిలుపునిచ్చాయి. ఆ జాబితాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, ఐర్లాండ్‌, బెల్జియం, లక్సంబర్గ్‌, ది నెదర్లాండ్స్‌, కెనడా, నార్వే, ఇస్తోనియా, లిథువేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇజ్రాయెల్‌, సౌదీ, యూఏఈ తదితర దేశాలున్నాయి..దీంతో మంగళవారం తెల్లవారుజామున ఎయిర్‌ ఇండియా తొలి ప్రత్యేక విమానం డ్రిమ్‌లైనర్‌ బీ-787 ఉక్రెయిన్‌ బయలుదేరింది. రెండు వందలకుపైగా సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఈ విమానం ఉక్రెయిన్‌ నుంచి ఈరోజు రాత్రి 10.30 గంటలకు ఢిల్లీ చేరుకొనున్నది.

తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామని పుతిన్‌ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థులు మరింత క్షణించాయి.