రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం… పెరగనున్న బంగారం ధర…

R9TELUGUNEWS.COM రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బలగాలకు, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఫిరంగుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. గత రెండు రోజుల్లో దాదాపు 500 పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు అమెరికా సహా నాటో కూటమిని కలవరపరుస్తున్నాయి..ఉక్రెయిన్‌ సైన్యమే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని 2014 నుంచి ఈ ప్రాంతాన్ని అదుపులోకి ఉంచుకొని పాలిస్తున్న రష్యా అనుకూల వేర్పాటువాదులు అంటున్నారు. వీటిని ఉక్రెయిన్‌ ఖండించింది. చిన్నారుల పాఠశాలపై తిరుగుబాటుదారులు జరిపిన దాడి చిత్రాలను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల గోడ ధ్వంసమైంది. వేర్పాటు వాద ప్రభుత్వాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..

రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేస్తోంది..

రష్యా , ఉక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయింది. కీవ్ లోని రష్యా రాయబార కార్యాలయాన్ని ఉక్రెయిన్ పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు రాయబార కార్యాలయంపై రష్యా జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయిలో దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి…ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.ఈ నేపథ్యంలో కైవ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని రష్యా ఖాళీ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం నాటికి, కైవ్‌లోని రాయబార కార్యాలయంపై రష్యా జెండా ఎగరలేదు మరియు పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. కొన్ని వారాలపాటు ప్రశాంతత కోసం ప్రయత్నించిన తరువాత, ఉక్రేనియన్ అధికారులు బుధవారం కూడా ఆందోళనను పెంచుతున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యాకు ప్రయాణానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చింది…

యుద్ధ వాతావరణంతో వాణిజ్య పై తీవ్ర ప్రభావం..!!!

రష్యాపై వాణిజ్యపరమైన ఆంక్షల విధింపు ద్వారా అమెరికా తొలి ప్రతిదాడి చేసింది. రెండవ ఆయుధంగా జర్మనీ, బ్రిటన్, అమెరికాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఇంకా సైనిక యుద్ధంగా మారకుండానే ఆర్థిక రూపంలో కొనసాగుతోన్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడం అప్పుడే మొదలైంది. ఉక్రెయిన్ సంక్షోభం, రష్యాపై అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. మార్కెట్లు సైతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. ధరల పెరుగుదల సామాన్యులకు శరాఘాతంగా పరిణమించే కాలం ఎంతో దూరంలో లేదు..తూర్పు ఉక్రెయిన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించడం ద్వారా రష్యా ఆక్రమణకు పాల్పడిందని ఆరోపిస్తోన్న అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నది. రష్యాపై వాణిజ్య ఆంక్షలకుతోడు తాజాగా అర్థిక ఆంక్షలు విధించింది. రష్యా ఉత్పత్తులపై ఆధారపడిన అన్ని దేశాలనూ తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు..రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని, ఉక్రెయిన్ ఆక్రమణకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని అందుకే పశ్చిమ దేశాలన్నీ రష్యాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపేస్తున్నాయని బైడెన్ తెలిపారు. అంతేకాదు, అతి త్వరలోనే రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తామని, ఉక్రెయిన్‌కు అన్నివిధాలా సహాయం అందిస్తామని బైడెన్ ప్రకటించారు..పసిడి ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యా మూడో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే రష్యాపై అమెరికా, నాటో వాణిజ్య పరమైన ఆంక్షలు విధించనున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌కు రష్యా నుంచి బంగారంతో పాటు పలు లోహాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడవచ్చన్న ఆందోళనలున్నాయి. ఈ కారణంగానే బంగారం, వెండికి గత కొన్ని రోజుల్లో డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది…

ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి బంగారం ధర పది గ్రాములు రూ. 55 వేలు దాటటం ఖాయం అంటున్నారు నిపుణులు…..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా చెబుతున్నారు. ఈ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 1,900 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి 24 డాలర్లకు పెరిగిపోయింది. ఇదే ర్యాలీ ముందు ముందు కూడా కొనసాగుతుందని బులియన్‌ నిపుణులు చెబుతున్నారు. కేవలం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు మాత్రమే కాదు.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ కూడా పడిపోయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరుగుతోంది..ఇలా అనేక కారణాలు బంగారం, వెండి ధరలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. బంగారానికి రష్యా యుద్ధానికి లింకేమిటబ్బా అని మీరు అడగొచ్చు.. ఆ లింకు కూడా ఉంది.. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యానే మూడో అతి పెద్ద దేశం మరి. అలాంటి రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే సీన్ ఒక్కసారిగా మారుతుంది. రష్యాపై అమెరికా, నాటో వాణిజ్య ఆంక్షలు విధిస్తాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ సప్లయి పడిపోవచ్చు. మరి సప్లయ్‌ తగ్గితే డిమాండ్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది….