రష్యాపై అమెరికా ఆంక్షలతో పెను విపత్తు…స్పేస్‌ స్టేషన్‌ భారత్‌, చైనా భూభాగంలో పడిపోయే ప్రమాదం…

రష్యాపై అమెరికా ఆంక్షలతో పెను విపత్తు..రష్యా అంతరిక్ష పరిశోధన అధిపతి హెచ్చరిక..
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) భూమిపై కూలిపోయే ప్రమాదం ఉన్నదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కోస్‌మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిమిత్రీ రొగొజిన్‌ హెచ్చరించారు…ఐఎస్‌ఎస్‌ కూలిపోతే భారత్‌ లేదా చైనా భూభాగంలో అది పడిపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో నలుగురు అమెరికా, ఇద్దరు రష్యా, ఒక జర్మనీ వ్యోమగామి ఉన్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తున్న రష్యాపై ఆగ్రహించిన అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో ఆర్థిక ఆంక్షలతోపాటు సాంకేతిక బదిలీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. దీంతో ఐఎస్‌ఎస్‌ నిర్వహణలో రష్యా సహకారాన్ని తీసుకొనే అవకాశం లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో దిమిత్రీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా సహకారం అందకుండా అమెరికా నిషేధం విధిస్తే.. ఐఎస్‌ఎస్‌ కక్ష్య తప్పకుండా ఎవరు చూస్తారు? అది అమెరికాలోనూ, యూరప్‌లోనో పడిపోదా? 500 టన్నుల బరువున్న ఐఎస్‌ఎస్‌ భారత్‌, చైనా భూభాగంలో పడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. వాళ్లకు ప్రమాదం సృష్టించాలని అనుకొంటున్నారా?’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు…