అయినవాళ్లు లేక గడప మీదే శవం..రెండ్రోజులకు గుర్తించిన స్థానికులు..

తలవాకిట తలవాల్చిన తల్లి..అయినవాళ్లు లేక గడప మీదే శవం..రెండ్రోజులకు గుర్తించిన స్థానికులు…
R9TELUGUNEWS.COM.
అయినవాళ్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ చనిపోయి రెండ్రోజులైనా ఎవరూ గుర్తించని దయనీయ ఉదంతమిది. మృతదేహం చుట్టూ చీమలు పట్టిన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. ఈ గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి కోడలు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆడపిల్లలు పెళ్లిళ్లయి అత్తారిళ్లలో ఉంటున్నారు. రాజేశ్వరి ఒక్కరే గ్రామంలో ఉంటూ అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం స్థానికులతో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత కనిపించలేదు. క్రిస్మస్‌ సెలవులు రావడం, ఆమె ఇల్లు కాలనీలో చివరన ఉండడంతో ఎవరూ అటువైపు తొంగిచూడలేదు. 50 గడపలు మాత్రమే ఉండే ఆ ఊళ్లో చాలామంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామం దాదాపుగా నిర్మానుష్యంగానే ఉండడంతో ఆమె గురించి ఆరా తీసేవారే లేకపోయారు. ఏ క్షణాన ఉప్పెనలా గుండెపోటు వచ్చిందో కానీ వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇంటి గుమ్మం మీదనే కుప్పకూలి చనిపోయింది…