విపక్షాల ఆందోళనల మధ్యే రాజ్యసభలో సాగుచట్టాల రద్దు.. ఒకేరోజు ఉభయసభలు ఆమోదం!…

R9TELUGUNEWS.COM సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యసభలోనూ ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సాగు చట్టాల రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దీనిపై చర్చ జరగాలని రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్‌ అనుమతించలేదు. అనంతరం మూజువాణి పద్ధతిలో సాగు చట్టల రద్దుకు సంబంధించిన మూడు బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇలా ఎటువంటి చర్చ లేకుండానే విపక్షాల ఆందోళనల మధ్య సాగు చట్టాల రద్దు బిల్లులకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.అయితే, సాగు చట్టాల రద్దు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు ఛైర్మన్‌ అనుమతించారు. ఈ సందర్భంగా ఈ మూడు రద్దు బిల్లులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలపై 15 నెలల తర్వాతైనా ప్రభుత్వం మేల్కోవడం సంతోషకరమన్నారు. అయితే, వీటిపై చర్చ జరపాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.అంతకుముందు సాగుచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వాటిపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా స్పీకర్‌ ఓంబిర్లా తిరస్కరించారు.అనంతరం మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుకు ఆమోదం తెలిపిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగకుండా ఆమోదం తెలపడాన్ని తప్పుబడుతున్నాయి. ఈ అంశంలో ప్రతిపక్షాలకు కనీసం ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇలా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే సాగు చట్టాల రద్దుకు సంబంధించిన మూడు బిల్లులు ఉభయసభల ఆమోదం పొందడం గమనార్హం.