6000 మీటర్ల లోతులో…..సముద్రం గుట్టు విప్పనున్న ‘మత్స్య 6000’….

భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ను సముద్ర గర్భంలోకి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. సముద్రాయాన్‌ ప్రాజెక్ట్ కింద నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ ఈ సబ్‌మిర్సిబుల్‌ను నిర్మిస్తోంది…

‘మత్స్య 6000’ అని పిలిచే మొట్టమొదటి మానవసహిత సబ్‌ మెర్సిబుల్‌తో సముద్ర గర్భంలో ఉన్న వనరులను అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా 6000 మీటర్ల లోతుకు ముగ్గురు వ్యక్తులు వెళ్లనున్నారు. ఈ విషయమై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ డైరెక్టర్ ఆనంద్‌ రామదాస్‌ మాట్లాడుతూ.. సముద్ర వనరులను సమృద్ధిగా ఉపయోగించేకునేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ మిషన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మత్య్స 6000 ముగ్గురిని సముద్ర గర్భంలో 6 కిలోమీటర్ల తోతుకు తీసుకెళ్తుంది. అంతరిక్షాన్ని జయించడం ఎంత కష్టమో, సముద్ర గర్భాన్ని జయించడం అంతే కష్టమని రామదాస్‌ అభిప్రాయపడ్డారు…సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు సబ్‌మిర్సిబుల్ వెళ్తుందని, సముద్ర మట్టం కంటే లోపల 600 రెట్ల పీడనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని రామదాస్‌ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘మార్స్‌పై ఉన్న రోవర్‌ను భూమిపై నుంచి నియంత్రింవచ్చు. కానీ 20 మీటర్ల లోతున్న ఉన్న వాటిని నియంత్రించలేము. దీనికి కారణం విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించలేవు. అంతలోతులో కమ్యునికేషన్‌ చేయడానికి వ్యవస్థ అందబాటులో లేదు. కాబట్టి సముద్ర గర్భంలో సమాచారాన్ని సేకరించడానికి కచ్చితంగా మనుషులు ఉండాల్సిందే. ఇది కచ్చితంగా పెద్ద సవాల్‌’ అని రామదాస్‌ చెప్పుకొచ్చారు.

ఇక మత్స్య 6000లో ఎన్నో రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని.. NIOT శాస్త్రవేత్త సత్యనారయణ్ తెలిపారు. సముద్ర గర్భంలోకి వెళ్లే సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 500 మీటర్ల లోతులో పరీక్ష చేయించుకున్న ఉక్కుతో చేసిన ప్రెజర్ హల్‌ను రూపొందించింది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఏడు మీటర్ల లోతులో మనుషులతో కూడా దీనిని పరీక్షించారన్నారు. 12 గంటల పాటు ఈ పరిశోధన కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. నీటి ఒత్తిడిని తట్టుకొని నిలబడేందుకు మత్య్సా 6000ని టైటానియం మిశ్రమంతో రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ను ప్రయోగించిన ఆరవ దేశంగా భారత్‌ నిలవనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనాలు ఈ ఘనతను సాధించాయి…