జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం..

కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. ఛతర్‌పూర్‌లోని నివాసంలోనే కుప్పకూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. క్రమతప్పకుండా డయాలసిస్ చేయించుకునేవాడు. బీహార్ రాజకీయాల్లో శరద్ యాదవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శరద్ యాదవ్ పార్ధివ దేహాన్ని న్యూ ఢిల్లీ ఛతర్‌పూర్‌లోని 5ఎ వెస్ట్రన్ నివాసంలో అభిమానులు, బంధుమిత్రుల సందర్శనార్ధం రోజంతా ఉంచుతారు..

మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, తదితరులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు..