ఎస్బీఐ ఇండ్ల రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ..

ఇండ్ల రుణాల‌పై వ‌డ్డీరేట్లు పెరుగుతున్నాయి.. నెల‌వారీ రుణ వాయిదా (ఈఎంఐ)లు భారం అవుతున్నాయి. కొత్త‌గా ఇండ్ల రుణాలు తీసుకునే వారికి భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తీపి క‌బురందించింది. ఇండ్ల రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు 50-100 శాతం మాఫీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ వ‌చ్చేనెలాఖ‌రు వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపింది…ఎస్బీఐ వెబ్‌సైట్ ప్ర‌కారం ఇండ్లు, ఇండ్ల సంబంధ రుణాల‌పై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం మాఫీ చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇండ్ల రుణాల‌పై టాప్ అప్ అనుబంధ రుణాల‌పై బేసిక్ ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా (100 శాతం) రాయితీ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక ఇత‌ర అడ్వ‌కేట్‌, వాల్యూయ‌ర్ ఫీజు-వాస్త‌విక ఖ‌ర్చులు య‌ధావిధిగా రుణ గ్ర‌హీత నుంచి వ‌సూలు చేస్తారు.ఎస్బీఐ ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 7.55 ప్ల‌స్ సీఆర్పీ. రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్‌) 7.15 ప్ల‌స్ సీఆర్పీ.. క్రెడిట్ స్కోర్‌ను బ‌ట్టి రిస్క్ ప్రీమియం ఖ‌రారు చేస్తారు. మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్‌) 0.10 శాతం పెంచేసింది. పెంచిన వ‌డ్డీరేట్లు జూలై 15 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.