నౌకాదళం భారత్ సరికొత్త అస్త్రం..

సరిహద్దుల్లో చైనా ఆర్మీ కవ్వింపుల నేపథ్యంలో భారత నౌకాదళం తమ సరికొత్త అస్త్రాన్ని తమ అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. కల్వరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐదో జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వగీర్ ను భారత నౌకాదళం ముంబైలో ఈ ఉదయం ప్రారంభించింది.

నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ జలాంతర్గామితో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ..ఫ్రాన్స్ నుంచి సాంకేతికత బదిలీతో ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ వాగిర్‌ను నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు.

ఇది సముద్ర జలాల్లో శత్రువులను పసిగట్టడంలో దేశ సముద్ర ప్రయోజనాలను మరింతగా పెంచడానికి ఉపయోగపడుతుందని, యుద్ధ సమయాల్లో శత్రు యుద్ధనౌకలను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతమని భారత నౌకాదళం పేర్కొన్నది. …’వగీర్’ అంటే ఇసుక సొరచేప. ఐఎన్ఎస్ వగీర్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సార్‌లు ఉన్నాయి. వగీర్ ఆయుధ ప్యాకేజీలో తగినంత వైర్-గైడెడ్ టార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని దెబ్బకొట్టేందుకు తగినన్ని ఉపరితల క్షిపణులు, ఉప-ఉపరితలం ఉన్నాయి. జలాంతర్గామి ప్రత్యేక కార్యకలాపాల కోసం మెరైన్ కమాండోలను కూడా ప్రారంభించగలదు. దాని శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని నేవీ తెలిపింది. ఆత్మరక్షణ కోసం, ఇది అత్యాధునిక టార్పెడో డికాయ్ సిస్టమ్‌ను కలిగి ఉందని నేవీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం ఉనికిని పెంచుతున్న నేపథ్యంలో ఐఎన్ ఎస్ వగీర్ ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.