ప్రసిద్ధి గాంచిన శక్తిపీఠంలో అర్చకుల కొరత…!!!.

శక్తిపీఠంలో అర్చకుల కొరత..
R9TELUGUNEWS.COM
అలంపూర్‌ సన్నిధికి నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు దర్శనాలకు వస్తుంటారు. ఇలాంటి ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో అర్చకుల కొరత నెలకొంది. జోగులాంబ ఆలయంలో ఒక ముఖ్య అర్చకుడు, ఇద్దరు వేదపారాయణదారులు, అర్చకుడు, పరిచారకుడు ఉన్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు ముఖ్య అర్చకులు, ముగ్గురు అర్చకులు, నరసింహ్మస్వామి ఆలయానికి ఈ మధ్య కాలంలో మరో అర్చకుడిని నియమించారు.

అమ్మవారి సన్నిధిలో….

జోగులాంబ ఆలయంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో అర్చకులు ఇద్దరు ఉండటంతో ఒకరు అంతరాలయంలో త్రిశతి, ఖడ్గమాల చేస్తుంటారు. ఇదే సమయంలో వాహన పూజకు వస్తే మరో అర్చకుడు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికితోడు కుంకుమార్చన చేస్తుండాలి. మధ్య మధ్యలో ప్రముఖులు దర్శనానికి వస్తుంటారు. ఇదే పరిస్థితి స్వామివారి ఆలయంలో సైతం నెలకొంది. దీంతో భక్తులు కొన్ని సందర్భాల్లో పూజలు చేసుకోలేక పోతున్నారు. అర్చకుల కోసం చాలా సమయం పాటు నిరీక్షించే పరిస్థితి ఏర్పడుతుంది. జోగులాంబ ఆలయంలో అర్చకుల కొరతతో కుంకుమార్చన చేయడం లేదు. అలాగే వాహన పూజలకు సైతం ఇబ్బందిగా ఉంది.

చండీహోమం రోజు మరింత ఇబ్బంది..

జోగులాంబ ఆలయంలో ప్రతీ శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య సమయంలో ఒక అర్చకుడు చండీహోమం చేస్తుంటారు. ఆ రోజుల్లో భక్తులు రద్దీ ఎక్కువ ఉంటే ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే ప్రముకులు వస్తే సాధారణ భక్తులకు ఆ సమయంలో తీర్థం, హారతి ఇచ్చే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో అంతరాలయంలో త్రిశతి, ఖడ్గమాల చేస్తున్న సమయంలో భక్తులు అమ్మ వారిని దండం పెట్టుకొని వెళ్లాల్సి ఉండగా.. తీర్థం కూడా పోయలేని పరిస్థితి ఉంటుంది. ఇలా ఉభయ ఆలయాల్లో అర్చకుల కొరత ఉండటంతో ఇటు భక్తులు, అటు అర్చకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అర్చకులు కొన్నిసార్లు విధులకు రాని సందర్భాల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.

ఏడాదికి రూ.4 కోట్ల ఆదాయం.

ఆలయాలకు ఏడాదికి దాదాపు రూ.4 కోట్ల మేరకు ఆదాయం వస్తుంది. కానీ అర్చకుల నియామకం చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని ఏళ్ల నుంచి అర్చకుల సమస్య ఉంది. ఉత్సవాల సమయంలో అర్చకుల కొరత జఠిలంగా ఉంటుంది.అప్పుడు కొంత మంది అదనపు అర్చకులను తీసుకుంటున్నారు. ఉత్సవాలు పూర్తి కాగానే వారంతా వెళ్లిపోతారు.

తప్పని సరిగా నియమిస్తాం.వీరేశం ఈవో, అలంపూర్‌.

ఆలయాల్లో అర్చకుల సమస్య ఉన్న మాట వాస్తవమే. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అక్కడ నుంచి అనుమతి రాగానే అర్చకులను నియమించుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. జోగులాంబ, స్వామి వారి ఆలయంలో అర్చకులు లేకపోవడంతో కొన్ని పూజలు చేయలేక పోతున్నాం.