600 వాహనాల కాన్వాయ్ తో మహారాష్ట్రకు కేసీఆర్ వెళ్లడంపై శరద్ పవార్ స్పందన..

ముంబై : 600కుపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌ నుంచి సోలాపూర్‌కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రావడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ‘‘పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి వచ్చి ఆలయాలను సందర్శిస్తే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, భారీ సంఖ్యలో వాహనాలను తీసుకొచ్చి బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది” అని కామెంట్ చేశారు. కేసీఆర్‌ తన పర్యటనలో ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంచడంపై దృష్టి సారిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 2021లో మహారాష్ట్రలోని పండరిపుర్‌ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమిపాలైన ఎన్సీపీ నేత భగీరథ్ భాల్కే గత మంగళవారం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

దీనిపై పవార్‌ స్పందిస్తూ.. పార్టీ నుంచి ఒక్క వ్యక్తి వెళ్లిపోతే ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. “2021 ఉప ఎన్నికలో భాల్కేకు టికెట్ ఇవ్వడం మా తప్పుడు నిర్ణయం. ఆ విషయాన్ని మేం లేట్‌గా గుర్తించాం.. దీనిపై ఇంకా మాట్లాడదల్చుకోలేదు” అని స్పష్టం చేశారు. గత సోమవారం మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్‌.. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా పండరిపుర్‌లోని విఠల్‌ రుక్మిణి దేవస్థానాన్ని, పలు ఆలయాలను దర్శించుకున్నారు. సర్కోలీలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు