షర్మిలతో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి భేటీ..

తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను కూడా ఆమె చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో జరగాల్సిన షర్మిల సమావేశం.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్పాండ్లోని నివాసంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు.. షర్మిలపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవుపలికిన ఆయన.. వైఎస్ చనిపోయినా వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారు.. ఇది అభినందనీయం అన్నారు. మహిళలను ప్రోత్సహించాలి, గౌరవించాలన్నారు రంగారెడ్డి. ఇక, లక్షలా మంది ప్రజాప్రతినిధులను వైఎస్ తయారు చేశారు.. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు రంగారెడ్డి.. వైఎస్ షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దని మా పార్టీ నేతలకు సూచిస్తున్నాన్న ఈ కాంగ్రెస్ నేత, నిజాయితీ పనులు చేసే వారిని అభినందించాలన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు నాయకులు కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగి.. ఇప్పుడు ఆయన్ని విమర్శించం గొప్ప కాదని మండిపడ్డారు రంగారెడ్డి.