నోముల నర్సింహయ్య నేటితరం నాయకులకు ఆదర్శం…సీఎం కేసీఆర్.

నేటితరం నాయకులకు నోముల నర్సింహయ్య ఆదర్శం: కేసీఆర్.

దివంగత నేత, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరమన్నారు. నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రులని, గొప్ప ఉద్యమశీలి.. ప్రజానాయకుడు అని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం నోముల నిరంతరం తపించారని కేసీఆర్‌ అన్నారు. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ చైతన్యాన్ని నోముల పుణికిపుచ్చుకున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం నోముల తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్టు నేతగా ప్రజాసేవలో గడిపారన్నారు. శాసనసభ్యుడిగా నోముల నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు…1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో నోముల నర్సింహయ్య జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పేదల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నోముల అనేక పోరాటాలు చేశారు. తన ఆశయాలకు అనుగుణంగా నోముల సీపీఎంలో చేరారు. నకిరేకల్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించారు. సీపీఎం శాసనసభాపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. నేటితరం నాయకులు నోముల నర్సింహయ్యను చూసి నేర్చుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ప్రయోజనాల కోసం నోముల పోరాడారు. నాగార్జున సాగర్‌ ఎడమకాల్వ రైతుల ప్రయోజనాల కోసం పోరాడారు. నకిరేకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి నోముల పాటుపడ్డారు. తెరాసతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని నర్సింహయ్య విశ్వసించారు. 2018లో సాగర్‌ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేశారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం చివరి వరకు కృషి చేశారు. నోముల మృతి తెలంగాణకు, తెరాసకు తీరని లోటు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం ప్రసంగం అనంతరం శాసనసభాపతి అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.