చక్కెరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఎల్ నినో భయాందోళనల వేళ దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేసేందుకు, స్థానిక మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరుకు నుంచి ఇథనాల్ ను తయారు చేసే విధానానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చక్కెరతో పాటు చెరుకు రసం, షుగర్ సిరప్, బీ-హెవీ మొలాసిస్ వాడకాన్ని ప్రభుత్వం విషేధించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా షుగర్ ధరలు అదుపులోకి రానున్నాయి..

ఇథనాల్ తయారీకి షుగర్ వాడకంపై బ్యాన్ విధించడంతో మొక్కజొన్న, విరిగిన బియ్యం, అదనపు ఆహార ధాన్యాలు, భారత ఆహార సంస్థ (FCI) వద్ద ఉన్న మిగులు బియ్యం వంటి ధాన్యాల ఆధారంగా ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యం పెరగనున్నట్లు తెలుస్తోంది. చక్కెర పరిశ్రమ నుంచి వచ్చే సీ-హెవీ మొలాసిస్ వంటి ప్రత్యామ్నాయ ముడి పదార్థాల వినియోగంపైనా దృష్టి సారించనున్నారు. కాగా భారత్‌లో పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమం (EBP) కింద 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని నిర్దేశించిన గడువుకంటే ముందుగానే సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 2,000 కోట్ల లీటర్లకు చేరినట్లు అంచనాలు ఉన్నాయి.