ఎర్రకోట విధ్వంసం ఘటన వెనుక పంజాబ్ కు చెందిన డీప్ సిద్దు….! ప్రస్తుతం పోలీసులు, ఎన్ఐఏ, సిట్ ఈ కేసును దర్యాప్తు…

ఎర్రకోట ఘటన ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఎర్రకోటలో రైతులు నిన్నటి రోజున విధ్వంసం సృష్టించారు. ప్రశాంతంగా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని, ఎవరికీ ఆటంకం కలిగించకూడదని పోలీసులు తమ అనుమతి ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి కొంతమంది ఎర్రకోటని ముట్టడించారు. ఎర్రకోటలో విధ్వంసం సృష్టించారు. ఎర్రకోటపై నిశాన్ సాహిబ్ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటన వెనుక పంజాబ్ కు చెందిన డీప్ సిద్దు అనే వ్యక్తి ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంజాబీ గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధూ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. రైతుల ఆందోళనకు సపోర్ట్ చేసిన సిద్ధూ ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేశారు. అయన ప్రసంగాలతోనే రైతులు ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిద్దు బీజేపీ కార్యకర్త అని, ఆ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని, శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీలో అశాంతిని సృష్టించేందుకు అసాంఘిక శక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొన్నది. అయితే, సిద్దు మాత్రం తనకేమి తెలియదని, తన ప్రసంగాల వలనే రైతులు ఎర్రకోటను ముట్టడించారని చెప్పడం అవివేకం అని అన్నారు. ప్రస్తుతం పోలీసులు, ఎన్ఐఏ, సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది.