శిల్ప కేసులో తెరపైకి కొత్త పేరు .ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది?.

*శిల్ప కేసులో తెరపైకి కొత్త పేరు .ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది?.

R9TELUGUNEWS.COM: అధిక వడ్డీల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని నార్సింగ్‌ పోలీసులు ఈరోజు కూడా ప్రశ్నించారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తామంటూ బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగ్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలమేరకు రెండ్రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె నుంచి పలు విషయాలు సేకరించారు. పలువురి నుంచి తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ప్రశ్నలు సంధించారు. తన వద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు సమాచారం. స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా రాధికకు డబ్బులు ఇచ్చానని, ఆమె తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో నష్టపోయానని చెప్పినట్టు సమాచారం. ‘సెహరి’ చిత్ర నిర్మాణంలో శిల్ప 12శాతం పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాలోని శిల్ప ఇంటికి ఆమెను తీసుకెళ్లి సోదాలు నిర్వహించిన పోలీసులు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం తనకు లేదని పోలీసుల ఎదుట శిల్ప వాపోయినట్టు సమాచారం. ఈనేపథ్యంలో శిల్ప పేర్కొన్న రాధికను పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ ఇవాళ్టితో ముగియనుండటంతో సాయంత్రం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.
నిందితుల బ్యాంకు ఖాతాల పరిశీలన.
శిల్పాచౌదరి దంపతుల మోసం కేసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. పోలీసులకు మాత్రం ఇప్పటి వరకు ముగ్గురే ఫిర్యాదు చేశారు. రూ.కోట్లలో నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని భావించారా! అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.