మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి మహాజాతరకు అంతారడీ

*మహాజాతరకు అంతారడీ .
సూర్యాపేట జిల్లా..
మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో..

సర్వాంగ సుందరంగా ముస్తాబైన శివాలయం…
ఎన్నో విశిష్టతలున్న శివలింగం…
ఐదు లక్షల మంది భక్తుల రాక…..‌
పలు విశిష్ట ఆలయాల సామాహారంగా మేళ్లచెరువు…
మార్చి 1 నుండి ఐదు రోజుల పాటు జరగనున్న మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరకు సర్వం సిద్దమైంది.తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర కావడం, దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం గా పేరొందడంతో ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యే ఈ జాతరకు అన్ని శాఖల ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేసేశారు.

*పెరిగే శివలింగం….దక్షిణ కాశీగా ప్రతీతి*
11 వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి ఈ పాలరాతి దివ్యలింగం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.ప్రతి 12 ఏళ్లకు అంగుళం చొప్పున పెరగడం,తలపై సహజసిద్దమైన గంగ,ఎంతనీరు తీసినా మళ్లీ ఉద్భవించే గంగ,అర్ధనారీశ్వర ఆకృతి,పార్వతీ కురుల ఆనవాళ్లు ఇలా సైన్స్ కే అంతుచిక్కని దివ్యలింగం దక్షిణ భారత దేశం లో ఎక్కడా దర్శనమివ్వకపోవడంతో మహిమాన్విత క్షేత్రంగా చరిత్ర పుటల్లోకెక్కింది.శివాలయంతో పాటు రాష్ట్రంలోనే అతి పెద్ద 55 అడుగుల పంచముఖ ఆంజనేయ విగ్రహం,అరుదైన ఉత్తర ద్వార వెంకటేశ్వరుని ఆలయం, రేవూరులో నిర్మాణం తుది దశలో ఉన్న పంచపాండవుల ఆలయం ఇలా పలు విశిష్ట ఆలయాలు కూడా ఇక్కడే కొలువై,భక్తుల దర్శనార్ధం సిద్దమై ఉన్నాయి..

*ఐదు రోజుల జనజాతర*

మహాశివరాత్రి జాతర ఇక్కడ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుతారు.మేడారం తర్వాత ఇదే పెద్ద జాతర.16 శాఖలకు చెందిన
681 మంది సిబ్బంది భక్తుల సేవల్లో విధులు నిర్వహించనున్నారు.30 ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా ప్రయాణికుల్ని చేరవేస్తాయి..

*రాష్ట్రస్థాయి పందేలు*
రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా వినోద,క్రీడల పోటీలు జరగనున్నాయి.తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లపందేలు, ప్రో కబడ్డీ ని తలపించే పోటీలు,వినోద కార్యక్రమాలను అందించే 9 భారీ లైటింగ్ ప్రభలు కనువిందు చేయనున్నాయి.వీటిని చూసేందుకు వీక్షకుల కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పిల్ల పెద్దలకు ఉల్లాసాన్నిచ్చే జెయింట్ వీల్స్,రంగుల రాట్నాలు,బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తున్నారు..

*ఈసారి ప్రత్యేకతలివే*.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో…
గత జాతరకంటే ఈ సారి భిన్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, ముప్పై ఏళ్ల తర్వాత భక్తులకు మళ్లీ ఫ్రీ దైవ దర్శనం,రెండు చోట్ల మహా అన్నదాన కార్యక్రమాలు,వేద బ్రాహ్మణులచే శతచండీ యాగాలు,సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా విఐపి దర్శనంకోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్దమయ్యాయి.ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలను గుర్తించారు.సిసి కెమేరాల. ద్వారా పోలీస్ నిఘా కొనసాగనుంది.ట్రాఫిక్ నియంత్రణ కోసం రికవరీ వ్యాన్ ను తొలిసారి ఏర్పాటు చేశారు. స్థానిక మైహోం,సువర్ణ,ప్రియ సిమెంట్ పరిశ్రమలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి…

కొసమెరుపు…
కాంగ్రెస్ పార్టీ.. అధికార తెరాస పార్టీ మధ్య నువ్వా, నేనా అనేలా పోటాపోటీగా పోటీలు ఏర్పాటు చేయడం విశేషం…. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అని విధంగా రాజకీయం వేడెక్కడం తో జాతరలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది….