రెండు వారాలు ఆలస్యంగా స్కంద సెప్టెంబర్ 28న విడుదల..!

టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. హీరో ఎవరైనా ఆయన సినిమా అంటే కత్తి పట్టాల్సిందే, రక్తపుటేరులు పారించాల్సిందే. కెరీర్ బిగినింగ్ నుండి తనకంటూ ఓ శైలి క్రియేట్ చేసుకుని చిత్రాలు చేస్తున్నాడు. బోయపాటి కెరీర్లో భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి హిట్స్ ఉన్నాయి..

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ (Skanda) కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు విడుదల తేదీని మార్చారు. రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 28న విడుదల చేయాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఈరోజు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘స్కంద’ వెనక్కి వెళ్లడానికి కారణం ‘సలార్’.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్’ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ తేదీని ఆక్యుపై చేయడానికి పలు సినిమాలు ప్రయత్నించాయి. ముందుగా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘రూల్స్ రంజన్’ కొత్త విడుదల తేదీగా సెప్టెంబర్ 28ని ప్రకటించింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్‌లో రావాల్సి ఉంది. కానీ, సెప్టెంబర్ 28 మంచి రిలీజ్ డేట్ అని ముందుగా వచ్చేస్తున్నారు..