నేటి చిట్టికథ…

సూరదాసు శ్రీకృష్ణ భగవానుని భక్తుడు.

ఆయన అంధుడు.

ఒకసారి ఆయన యాత్రకై బయలుదేరి దారిలో ఒక నీరులేని బావిలో పడిపోయాడు.

ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ “ఓ భగవంతుడా! నేను అంధుణ్ణి. నేను ఈ బావి నుండి బయట
పడలేకపోతున్నాను. నన్ను కాపాడు స్వామీ! నీవు ఒక్కడవే నన్ను రక్షించగలవు” అని కోరాడు.

ఆయన మొర ఆలకించి శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా అక్కడికి విచ్చేసి సూరదాసును రక్షించారు.

వారి సంభాషణను గుర్తుపట్టి సూరదాసు వచ్చినవారు శ్రీకృష్ణభగవాన్, రాధాదేవిగా గుర్తించాడు. ఆయన ఇలా ప్రార్థించాడు “భగవాన్! నేను నీ కంఠస్వరాన్ని మాత్రం వినగల్గుచున్నాను. గుడ్డివాణ్ణి కనుక దర్శించలేకపోతున్నాను”

శ్రీ కృష్ణుడు సూరదాసుతో ఒక చమత్కారం చేశాడు. “రాధా! అతని దగ్గరకు వెళ్లకు. అలా వెళితే నీపాదాలు పట్టేస్తాడు” అని కృష్ణుడు రాధను హెచ్చరించాడు.

రాధ తెలివిగా సూరదాసు వెనుకవైపుగా వెళ్ళి వీపును స్పృశించింది.

సూరదాసు ఆమెను గుర్తించి “ఓహో! నీవు నా వెనుకకు వచ్చావా తల్లీ అంటూ ఆమె పాదాలు పట్టేశాడు. రాధాదేవి అతని చేతుల నుండి విడివడి దూరంగా వెళ్లింది. కాని, సూరదాసు చేతిలో ఆమె కాలిఅందెలు ఉండిపోయాయి. రాధాదేవి సూరదాసుతో “శ్రీకృష్ణునికి చాల ఇష్టమైన నాకాలి అందెలు నాకు ఇచ్చేశేయి” అని అన్నది.

అందుకు సూరదాసు “నేను గుడ్డివాణ్ణి కదమ్మా! అందెలు నీవే నని నాకు తెలిసేదెట్లా? నేను చూడ గలిగితే అవి నీ వని నాకు తెలుస్తుంది. అందుకు నాకు చూపు ప్రసాదించమని శ్రీకృష్ణుని కోరు” అని అన్నాడు.

రాధాదేవి విన్నపంతో శ్రీకృష్ణుడు సూరదాసుకు “చూపు” కలిగించాడు.

ఆయన రాధా కృష్ణులను దర్శించగలందులకు మహాదానందం చెందాడు.

శ్రీకృష్ణునికి సూరదాసు పట్ల అనుగ్రహం కలిగింది.

*నీవేదయిన వరం కోరుకో ఇస్తా” అని శ్రీకృష్ణుడన్నాడు.

సూరదాసు వినమ్రతతో “ఓ! మహానుభావా! నీ దివ్యమంగళ స్వరూపం చూచిన పిమ్మట నాకు ప్రపంచంలోని ఇతర వస్తువులేవీ చూడాలని లేదు. నన్ను తక్షణం అంధుణ్ణిగా చేసేయ్” అని ప్రార్థించాడు.

శ్రీకృష్ణపరమాత్మ పట్ల సూరదాసు భక్తి అలాంటిది…