అన్న పాము కాటుతో మరణించగా..
చివరి చూపునకు వచ్చిన తమ్ముడిని పాము కాటేయగా అతడు కూడా మరణించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోనీ బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
భవానీపూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రా మంగళవారం పాము కాటుతో మరణించాడు. పంజాబ్లోని లూధియానాలో ఉంటున్న 22 ఏళ్ల తమ్ముడు గోవింద్ మిశ్రా తన అన్న మరణ వార్త విని చివరి చూపునకు వచ్చాడు.
కాగా, ఆ రాత్రికి గదిలో నిద్రపోతున్న గోవింద్ మిశ్రా, అతడి బంధువు చంద్రశేఖర్ పాండేను పాము కరిచింది. దీంతో గోవింద్ మిశ్రా కూడా చనిపోయాడు. చంద్రశేఖర్ పాండేను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే పాము కాటు వల్ల అన్నాదమ్ములు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇలాంటి దుర్ఘటనలు నివారించేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు