దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ……. సేమీస్‌లో పోరాడి ఓడిన‌ ద‌క్షిణాఫ్రికా..

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికాకు మరోసారి రిక్తహస్తమే మిగిలింది. ఇన్నాళ్లూ ఐసీసీ టోర్నీలలో వర్షం, డీఆర్‌ఎస్‌లు ఆ జట్టు ఫైనల్‌ చేరకుండా అడ్డుకుంటే ఇప్పుడు సఫారీల బ్యాటింగ్‌ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. భారత్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఆసాంతం తనదైన దూకుడైన బ్యాటింగ్‌, బెంబేలెత్తించే బౌలింగ్‌, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న సఫారీలు.. కీలకమైన నాకౌట్‌ దశలో తేలిపోయారు. బ్యాటింగ్‌లో విఫలమైనా స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఒక దశలో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చినా కంగారూలు పట్టు విడవకుండా ఆడటంతో సఫారీల పోరాటం మరోసారి సెమీస్‌కే పరిమితమైంది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు..47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఛేదనలో ట్రావిస్‌ హెడ్‌ (48 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌ (62 బంతుల్లో 30, 2 ఫోర్లు), డేవిడ్‌ వార్నర్‌ (18 బంతుల్లో 29, 1 ఫోర్, 4 సిక్సర్లు), ఆఖర్లో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లు రాణించి ఆసీస్‌ను రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేర్చారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. ఈనెల 19న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో జరుగబోయే టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది….

దక్షిణాఫ్రికా ఆటగాళ్లను 212 పరుగులకు పరిమితం చేసిన తర్వాత, ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా 16 బంతులు మిగిలి ఉండగానే 215-7తో విజయం సాధించింది..

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (62; 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. స్టీవ్ స్మిత్ (30), డేవిడ్ వార్న‌ర్ (29), జోష్ జోష్ ఇంగ్లిస్ (25 నాటౌట్‌) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో తబ్రైజ్ షమ్సీ రెండు వికెట్లు తీశాడు. కగిసో రబడ, మార్క్రామ్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్ లు ఒక్కొ వికెట్ తీశారు.

ద‌క్షిణాఫ్రికా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచ‌రీ చేసిన మొద‌టి ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచులో మిల్ల‌ర్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మిల్ల‌ర్ 115 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. అంత‌క‌ముందు 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచులో న్యూజిలాండ్ పై ఫాఫ్ డు ప్లెసిస్ చేసిన 82 పరుగులే అత్యుత్త‌మం.