దంచికొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు…. చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్.

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 229 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 22 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. సఫారీ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (109; 67 బంతుల్లో 12 ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు శతకం చేశాడు. రీజా హెండ్రిక్స్(85; 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్కో జాన్సెన్ (75 నాటౌట్ ; 42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (60; 61 బంతుల్లో 8 ఫోర్లు) దూకుడుగా ఆడగా మార్‌క్రమ్ (42) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలరల్లో రీస్ టాప్లీ మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో మార్క్‌వుడ్ (43 నాటౌట్‌), గుస్ అట్కిన్సన్ (35) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రబాడ, కేశవ్ మహరాజ్ ఒక్కొ వికెట్ సాధించారు.

సైకిల్ స్టాండ్‌..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేయలేదు. పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. జానీ బెయిర్ స్టో(10) తో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. సైకిల్ స్టాండ్‌ను తలపించింది. మలన్ (6), జో రూట్ (2), బెన్‌స్టోక్స్ (5) లు సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా.. హ్యారీ బ్రూక్ (17), జోస్ బట్లర్ (15), డేవిడ్ విల్లీ (12) లు సైతం విఫలం అయ్యారు. మార్క్‌వుడ్ (43 నాటౌట్‌), గుస్ అట్కిన్సన్ (35) ఫర్వాలేదనిపించారు….