భారత క్రికెట్ జ‌ట్టు ఆల్‌ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ గురువారం వివాహం…

భారత క్రికెట్ జ‌ట్టు ఆల్‌ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ గురువారం వివాహం చేసుకున్నాడు. గతేడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా గురువారం వైశాలి విశ్వేశ్వరను పెళ్లాడాడు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబస‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య చెన్నెలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. విజయ్‌ శంకర్‌ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఆటగాడు. దీంతో విజయ్‌ శంకర్‌కు స‌న్‌రైజ‌ర్స్ బృందం శుభాకాంక్ష‌లు తెలిపింది.వివాహ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను విజ‌య్ శంక‌ర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వివాహం చేసుకున్న విజ‌య్ శంక‌ర్‌కు భారత జట్టు ఆట‌గాళ్లు రాహుల్, చాహ‌ల్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. విజయ్‌ శంకర్‌ 2018లో భారత క్రికెట్‌ జట్టులోకి ప్రవేశించాడు. తొలిమ్యాచ్‌ శ్రీలంకతో జరిగిన టీ- 20లో ఆడాడు. 2019 వరల్డ్‌ కప్‌ భారత జట్టులో విజయ్‌ ఉన్నాడు. ఇప్పటివరకు విజయ్‌శంకర్‌ 12 వన్డేలు, 9 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.