రేపు శ్రీ‌రామన‌వ‌మి…!!..ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము…

రేపు శ్రీ‌రామన‌వ‌మి…!!

విశ్వంలో చిన్న పెద్ద తేడాలు లేకుండా భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడికి అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి,
పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.

శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడని, పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి,

ఆయ‌న‌ జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకోవడమే శ్రీ రామ నవమి..

14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు…

ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి…
సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి…

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ , వాడ వాడల్లోనూ రమణీయంగా, కమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం…

ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.

శ్రీ రాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం.. భద్రాచలం దివ్య క్షేత్రం.

శ్రీ రాముడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం.

శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి.

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది.

అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు…

సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే…
ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు…

కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా…
శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.

శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.

శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు…

ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము

శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి.

శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి.
సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి…

నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి.

సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి.

వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు.

లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి.
_శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు_

పూజ..

వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి…

చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం,

మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో

సీతాలక్ష్మామాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్ర‌హానికి పూజించాలి…

వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి…
అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది..

వీటితో పాటు ఏదైన ఒక ఫలం స్వామి వారికి నివేదించాలి…

ఈ రోజంతా రామ నామ స్మరణ ( _రామ రామ రామ సీత_ ) లో ఉండాలి, వీలైతే నలుగురు పేద జంటలకు కొత్త బట్టలు పెట్టాలి,

వారికి తృప్తిగా భోజనం పెట్టాలి, చిన్న పిల్లలకు పాణకం వడపప్పు పంచాలి …స్వస్థి.. శ్రీరామ్.

సమస్తలోకనం సుఖినోభవంతు.