ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..

తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నా మని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు శుక్రవారం వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా… 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.