శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన….

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక చేతులెత్తేసింది..

కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక.. కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. అయితే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ ఖజానా దివాలా తీసింద‌ని..కాబట్టి విదేశీ రుణాలు చెల్లించ‌లేమ‌ని చేతులెత్తేసింది.
అప్పులు కట్టడం మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ తేల్చేసింది… ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్‌ వద్ద నిరసనలు హోరెత్తాయి. నిరసనకారులు ‘గో హోమ్‌ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు కరెంట్‌, గ్యాస్‌, పెట్రోల్‌, మెడిసిన్‌ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పట్టుబట్టారు. అయితే, అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో ‘కొవిడ్‌ లాక్‌డౌన్‌’కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని మహింద రాజపక్స పేర్కొన్నారు. ఇదే సమయంలో.. శ్రీలంక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..