శ్రీలంక పై కివీస్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం..

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా గురువారం (నవంబర్‌ 9) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలోనే అందుకుంది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభం అందించారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (14), మార్క్‌ చాప్‌మన్ (7) నిరాశపరిచినా ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో లంకకు మరో ఓటమి తప్పలేదు. లక్ష్య ఛేదనలో గ్లెన్ ఫిలిప్స్ (17*), టామ్‌ లేథమ్ (2*) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్‌ 2 వికెట్లు, మహేశ్‌ తీక్షణ, దుష్మంత చమీర తలా ఒక వికెట్‌ పడగొట్టారు. మూడు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్‌ బౌల్ట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. లంకపై విజయంతో బ్లాక్‌ క్యాప్స్‌ నెట్‌ రన్‌రేట్‌ (0.922) మరింత మెరుగుపడింది. పాకిస్తాన్‌, ఆఫ్గాన్‌ నాకౌట్‌ రేసులో ఉన్నా ఆ జట్లు తమ తదుపరి మ్యాచుల్లో భారీ విజయం సాధించాల్సి ఉంది.అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్ కుశాల్ పెరీరా (51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో విరుచుకుపడిన ఫెరీరా కేవలం 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే మిగతా ఆటగాళ్లు పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8), ఏంజెలో మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వా (19), కరుణరత్నె (6), దుష్మంత చమీరా (1) వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి ఒకానొక దశలో 128 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది లంక. అయితే మహీశ్‌ తీక్షణ (39*), దిల్షాన్‌ మదుశంక (19) కాసిన్ని పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్ల తీయగా, ఫెర్గూసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్‌ రవీంద్ర 2, టిమ్ సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.