శ్రీశైలం.. సాగర్‌ల నుంచి డెబ్బై వేల క్యూసెక్కులకు పైగా విడుదల…

R9TELUGUNEWS.com.

జల విద్యుదుత్పత్తితో దిగువకు నీరు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జల విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 70 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 29,150 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. కుడిగట్టు జల విద్యుత్కేంద్రంలో ఏపీ 14.38 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి అనంతరం 30,890 క్యూసెక్కులు విడుదల చేస్తోంది. ఎడమగట్టు జల విద్యుత్కేంద్రంలో తెలంగాణ 17.062 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి, 35,315 క్యూసెక్కులను వదులుతోంది. హంద్రీ నీవా, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలకు కలిపి ఈ జలాశయం నుంచి మొత్తం 72,568 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 70,320 క్యూసెక్కులు ఉంది. ఇక్కడి నుంచి విద్యుదుత్పత్తి అనంతరం పులిచింతల వైపు 84,153 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల వద్ద 69,577 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా 51438 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 33 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.నిజాంసాగర్‌కు 24,800 క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.88 లక్షలు క్యూసెక్కులు వదులుతున్నారు.