తొలి పోరులో హైదరాబాద్‌ ఓటమి..

ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు ఎప్పుడూలానే మళ్లీ అభిమానులని నిరాశ పరిచింది..

ఈ సీజన్లోనైనా సన్రైజర్స్ రాత మారుతుందేమో అని ఎదురు చూసిన అభిమానులకు సేమ్ రిపీట్.. అనేలా ఉన్నది.. కనీసం పోటీ కూడా ఇవ్వలేదు అంటా చేతులెత్తేసింది..
అంచనాల్లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. తమ మొదటి మ్యాచ్‌లో నిరాశ పర్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్‌ సేన ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా.. దేవదత్‌ పడిక్కల్‌ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్‌ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఒకటికి నాలుగు నోబాల్స్‌ వేసిన మన బౌలర్లు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. కొండంత లక్ష్య ఛేదనలో కనీసం ప్రయత్నించకుండానే పరాజయాన్ని ఆహ్వానించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టును ముందుండి నడిపిస్తాడనుకున్న కేన్‌ విలియమ్సన్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. పది కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసుకున్న నికోలస్‌ పూరన్‌ (0) సున్నా చుట్టాడు. మార్క్మ్‌ (41 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా.. రాజస్థాన్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ 3, ప్రసిద్ధ్‌ కృష్ణ, ట్రెంట్‌ బౌల్ట్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శాంసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా బుధవారం బెంగళూరుతో కోల్‌కతా తలపడనుంది.