దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం భారీ షాక్ తగిలింది. ప్రారంభంలో లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్, మధ్యాహ్నానికి పూర్తిగా మలుపుతిరిగింది. భారీ విక్రయాలు చోటుచేసుకోవడంతో BSE Sensex 1,236 పాయింట్లు (1.48%) పతనమై 82,498 వద్ద ముగిసింది. Nifty 50 365 పాయింట్లు (1.41%) పడిపోయి 25,454 వద్ద నిలిచింది.
గత మూడు రోజులుగా కొనసాగిన లాభాల పరంపరకు బ్రేక్ పడి, ఒక్కరోజులోనే దాదాపు రూ.7.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. రియాల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, మెటల్స్ – ఇలా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చిన్న, మధ్య తరహా షేర్లు కూడా 1 నుంచి 1.5శాతం వరకు పడిపోయాయి. ప్రారంభ లాభాలు నిలబడకపోవడం, అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్‌ను కుదిపేసింది.
అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు : ఆకాశానికి ఎగబాకిన ముడి చమురు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులపై ఆందోళనలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఈ ఏడాది గరిష్టానికి చేరాయి.
భారత్ ముడి చమురులో సుమారు 85% దిగుమతులపై ఆధారపడుతోంది. చమురు ధరలు పెరగడం అంటే ద్రవ్యోల్బణ భయం, వడ్డీ రేట్లపై అనిశ్చితి. ఇదే పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారి తీసింది.
అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నివేదికలు వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ అవర్షన్‌ను పెంచింది. డాలర్ బలపడటం, రూపాయి బలహీనత కూడా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.