ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్‌…

ఉత్తరాఖండ్‌ బరిలో 632 మంది..

యూపీలో మైనారిటీ కీలకం…

గోవాలో ఓటర్లకు రాయితీలు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో భాగంగా రెండో విడత పోలింగ్‌ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో పోలింగ్‌ పూర్తి కానుంది. యూపీలో రెండో దశ పోలింగులో భాగంగా మరికొన్ని స్థానాల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు.అన్ని దశలకూ కలిపి ఓట్ల లెక్కింపును మార్చి 10న చేపట్టనున్న విషయం తెలిసిందే.

యూపీలో మైనారిటీలు కీలకం..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దశలో 55 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఓటర్ల తీర్పును కోరుతున్న 586 మంది అభ్యర్థుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత మహమ్మద్‌ ఆజంఖాన్‌, పలువురు మంత్రులు ఉన్నారు. గతసారి ఈ 55 స్థానాల్లో 38 చోట్ల భాజపా అభ్యర్థులు గెలిచారు. రెండోదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. సంప్రదాయంగా ఇవి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలు.

*గోవాలో ఓటర్లకు రాయితీలు*

గోవాలో 40 సీట్లకు గానూ 301 మంది పోటీ పడుతున్నారు. ప్రతిసారీ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొనే ఈ రాష్ట్రంలో ఈసారి బహుముఖ పోరు నెలకొంది. సిబ్బంది అంతా మహిళలే ఉండే 105 పోలింగ్‌ బూత్‌లను గోవాలో నెలకొల్పారు. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, విపక్ష నేత దిగంబర్‌ కామత్‌, మాజీ సీఎం లక్ష్మీకాంత్‌ పార్సేకర్‌ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్లు 11 లక్షల మంది. సగటున ఒక బూత్‌లో 672 మంది ఓటర్లే ఉన్నారు. ఇది దేశంలోనే అతి తక్కువ. వాస్కో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 35,139 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి పలు దుకాణాలు ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. హాట్‌ఎయిర్‌ బెలూన్‌లో షికారుకు, బంగీ జంపింగ్‌కు రాయితీతో అవకాశం కల్పిస్తామని మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఓటు వేసిన వచ్చిన జంటలకు ‘ప్రేమికుల దినోత్సవ’ ఆఫర్లు ఇస్తామని ఉత్తర గోవాలోని కొన్ని హోటళ్లు ఊదరగొడుతున్నాయి. గోవాలో ఎప్పుడూ విజేతల ఆధిక్యాలు స్వల్పంగానే ఉంటాయి. ఫిరాయింపులు ఎక్కువ. తీర్పు అస్పష్టంగా ఉంటుంది.

*ఉత్తరాఖండ్‌ బరిలో 632 మంది*

70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో 632 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దాదాపు 81.72 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వర్చువల్‌గా, భౌతికంగా ప్రచారాలతో పార్టీలు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న ఐదో అసెంబ్లీ ఎన్నిక ఇది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ, పలువురు మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌ వంటివారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ సహా పలువురు నేతలు పోటీ చేస్తున్నారు.