*నేటి చిట్టికథ..
🥀ఒక రాజు గారి కొలువులో ఇద్దరు పురోహితులున్నారు . అందులో ఒకనిపేరు “దైవాధీనం” జగత్తు అంతా భగవత్సంకల్పం అని నమ్మేవాడు.
🥀రెండో వానిపేరు “రాజాధీనం” ఎప్పుడూ రాజు గారి మెప్పుని మెప్పిస్తూ బహుమానాలు అందుకునేవాడు .
🥀ఒక రోజు రాజుగారికి, రాజాధీనం గారిని సువర్ణ ,వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు
🥀ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను నిక్షేపం చేసి రాజాధీనం గారికి దక్షిణగా దానం చేశాడు.
🥀ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతూ ఆలోచించాడు. దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అనుకుని ఒక శెట్టి గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .
🥀శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. “గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను.” అను కొన్నాడు.
🥀అప్పుడే అనుకోకుండా దైవాధీనంగారు అటు వెళ్తూ కనిపించారు . శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం (గుమ్మడికాయ దానం) చేశారు.
🥀దైవాధీనం గారి భార్య …. భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత. అందులో వజ్రవైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి.
🥀ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు.bమర్నాడు రాజాధీనం రాజ దర్శనానికి వెళ్లాడు .”గుమ్మడి కాయ కూర తిన్నారా…” అని రాజు అడిగాడు . ఆహా,ఓహో అద్భుతం అని పొగిడారు రాజాధీనంగారు.
🥀రాజు గారికి అర్ధమైంది …. గుమ్మడికాయ ఆయన ఇంటికిచేరలేదని . ఒళ్లుమండి భటులను పిలిపించి కొరడా తో ఝలిపించి నిజం తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని కొన్నాననీ… దైవాధీనం గారికి దానం చేశాననీ చెప్పాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .
🥀మరోసారి ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి … భటుడిని కనిపించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు.
🥀రాజాధీనం నడచివస్తు ,దాన్ని గమనించకుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయంలో మునిగాడు . రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు.
🥀రాజుకి అర్థమైంది… తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని. దురదృష్టవంతుల్ని బాగుచేయలేము..
*ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధానాంగుడై*
*త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమచ్ఛాయంత*
*చ్ఛిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా*
*బొరి దైవోపహతుండు పోవు కడకుం పోవుం గదా యాపదల్*
🥀‘ఖర్వాటుడు’ అంటే బట్టతల వాడు.ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి తాటిచెట్టు కింద నిలుచున్నాడు. తాటి చెట్టు కింద నీడుంటుందా? పోనీ నిలుచున్నాడు. ఇంతలో పై నుంచి తాటి పండు పడింది. తల రెండు ముక్కలయింది. దురదృష్టవంతుడు ఎక్కడికి వెళితే అక్కడికి ఆపదలు తరుముకుంటూ వస్తాయి మరి.