సౌర కిరీటం అద్భుతాన్ని చూశారా..!

సూర్యుడి నుంచి ఓ ప్లాస్మా పోగు విడిపోవడమేమిటి, ధ్రువ ప్రాంతంలో రింగులా చక్కర్లు కొట్టడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాసా శాస్త్రవేత్తలూ కాసేపు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఇలా జరగడం ఇదే తొలిసారని అంటున్నారు కూడా! సూర్యుడి అయస్కాంత క్షేత్రం రివర్స్‌ అవుతూండటం ఒక కారణం కావచ్చునని అంచనా వేస్తున్నారు… సూర్యుడు భగభగ మండే అగ్నిగోళమని మనందరికీ తెలుసు. హైడ్రోజన్, హీలియం మూలకాలు ఒకదాంట్లో ఒకటి లయమైపోతూ విపరీతమైన శక్తిని ఉత్పత్తి చేస్తూంటాయి..ఈ క్రమంలో అక్కడి పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఆవేశంతో కూడిన వాయువన్నమాట. అప్పుడప్పుడు సూర్యుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడం, ఫలితంగా కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు ఈ ప్లాస్మా పోగులు ఎగసిపడటం మామూలే. వీటిల్లో కొన్ని సూర్యుడి నుంచి విడిపోతూంటాయి కూడా. అయితే ఏ ప్లాస్మా పోగు కూడా ఇప్పటిదాకా ఇలా రింగులా మారి తిరగడం చూడలేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు..ఈ పోగు సూర్యుడి 55 డిగ్రీల అంక్షాంశం వద్ద మొదలై ధ్రువ ప్రాంతాల వైపునకు ప్రయాణిస్తూంటుందని అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో ఉన్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫరిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ స్కాట్‌ మాకింతోష్‌ వివరించారు. ”పదకొండేళ్లకోసారి ఇలా జరగడం, పోగు కచ్చితంగా ఒకే ప్రాంతం నుంచి మొదలై ధ్రువం వైపు ప్రయాణించడాన్ని పరిశీలించాం. ఈ పోగు పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో ఒకే చోట ఎందుకు పుడుతోంది? కచ్చితంగా ధ్రువాలవైపే ఎందుకు ప్రయాణిస్తోంది? ఉన్నట్టుండి మాయమైపోయి, మూడు నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా అదే ప్రాంతంలో మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? ఇవన్నీ ఎంతో ఆసక్తి రేపే విషయాలు” అని వివరించారు.కారణాలు మిస్టరీయే!
సూర్యుడి నుంచి ప్లాస్మా పోగులు విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2015లో కొద్ది వ్యవధిలోనే రెండు భారీ పోగులు విడిపోయాయి. మొదటిది సూర్యుడి ఉత్తర భాగంలో సంభవించింది..ప్లాస్మా కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. తరువాత కింది భాగంలోకి కలిసిపోయింది. రెండు గంటల తరువాత మరో పోగు విడిపోయింది. అయితే రెండు సందర్భాల్లోనూ ప్లాస్మా పోగు రింగులా మారడం, చక్కర్లు కొట్టడం జరగలేదు.

తాజాగా మాత్రమే అలా జరగడానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు నిర్ధారించాల్సి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యుడిపై కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతున్నాయని.. పదకొండేళ్ల సోలార్‌ సైకిల్‌లో కీలకదశకు ఇది నిదర్శమని వారంటున్నారు. ”ఈ సోలార్‌ సైకిల్‌ 2024లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పుడు సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాలు తారుమారవుతాయి. బహుశా ఆ క్రమంలోనే ఉత్తర ధ్రువ ప్రాంతంలో ప్లాస్మా రింగ్‌ ఏర్పడి ఉండవచ్చు” అని ప్రాథమిక అంచనాకు వచ్చారు.