టీ20 ప్రపంచకప్‌: బంగ్లాదేశ్‌పై తేలికగా గెలిచిన ఇంగ్లండ్

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు, లివింగ్ స్టోన్ 2 వికెట్లు, మొయిన్ అలీ రెండు వికెట్లు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ఛేదించింది. ఓపెనర్ జాసన్ రాయ్ (61 నాటౌట్), డేవిడ్ మలాన్ (28 నాటౌట్) రాణించారు. బట్లర్ (18) పరుగులకే అవుటయినా ఇంగ్లండ్ పెద్ద సవాలేమీ ఎదురుకాలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో నసమ్ అహ్మద్, ఇస్లాంలకు తలో వికెట్ దక్కింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే..