టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ పోరు..

జూన్‌ 9న… న్యూయార్క్‌లో…

టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ పోరు
– జూన్‌ 1 నుంచి 29 వరకు టోర్నీ

అమెరికా అభిమానుల సాక్షిగా టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌ నగరం వేదికగా జూన్‌ 9న టి20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో దాయాది జట్లు తలపడతాయి. ఈ ఏడాది జరిగే మెగా టోర్నీ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

*న్యూయార్క్‌* లోని ప్రతిష్టాత్మక *ఐసన్‌ హోవర్‌ పార్క్‌ స్టేడియంలో* భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ పార్క్‌లో ఇప్పటి వరకు సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లు మాత్రమే ఉండగా… ప్రపంచకప్‌ కోసం కొత్తగా క్రికెట్‌ మైదా నాన్ని సిద్ధం చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి జూన్‌ 29 వరకు జరిగే ఈ ప్రపంచకప్‌ టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడనుండగా… వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.

♦ గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న ఐర్లాండ్‌తో, జూన్‌ 9న పాకిస్తాన్‌తో, జూన్‌ 12న అమెరికాతో, జూన్‌ 15న కెనడాతో తలపడుతుంది.
♦ గ్రూప్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, మాజీ విజేత ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌ జట్లు ఉన్నాయి.
♦ గ్రూప్‌ ‘సి’లో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ జట్లకు చోటు కల్పించారు.
♦ గ్రూప్‌ ‘డి’లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌ జట్లు ఉన్నాయి.

లీగ్‌ దశ తర్వాత ఒక్కో గ్రూప్‌ నుంచి రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఆ తర్వాత ఎనిమిది టీమ్‌లతో ‘సూపర్‌ ఎయిట్‌’ దశ జరుగుతుంది. ఆపై సెమీఫైనల్స్, ఫైనల్‌ను నిర్వహిస్తారు.

వెస్టిండీస్‌లో 6 వేదికల్లో (బార్బడోస్, ట్రినిడాడ్, గయానా, ఆంటిగ్వా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌)… అమెరికాలోని 3 వేదికల్లో (న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్‌) కలిపి మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి.

టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి) జరుగుతాయి.