టీ20 ప్రపంచకప్ 2026 వేటను భారత్ ఘనవిజయంతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన పోరులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో టాప్ ఆర్డర్ కుప్పకూలి ఓటమి భయం వెంటాడినా, ముగ్గురు ఆటగాళ్లు అసాధారణ ప్రతిభ కనబరిచి భారత్‌ను గెలిపించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరో చూద్దాం.
1. సూర్యకుమార్ యాదవ్
భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేయదేమో అన్న స్థితిలో ఉన్నప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతం చేశాడు. ఒత్తిడిలోనూ చెలరేగి ఆడుతూ 171 స్ట్రైక్ రేట్‌తో కేవలం 49 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్య ఆడి ఉండకపోతే భారత్ ఈ మ్యాచ్‌ను గెలవడం అసాధ్యమయ్యేది. అందుకే ఆయన ఈ గెలుపుకు మొదటి హీరో.
2. మహమ్మద్ సిరాజ్
హర్షిత్ రాణా స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన సిరాజ్, తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. పవర్‌ప్లేలో అమెరికా ఓపెనర్ల వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోకుండా చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఓవర్లోనే గూస్‌ను అవుట్ చేసి అమెరికా పతనానికి పునాది వేశాడు.
3. అక్షర్ పటేల్
ఉప-కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో అసలైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. బ్యాటింగ్‌లో సూర్యకు తోడుగా నిలిచి 41 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక బౌలింగ్‌లో తన మార్క్ చూపించాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అమెరికా గెలుపు ఆశలను పూర్తిగా ఆవిరి చేసేశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
ఆ ఒక్క క్యాచ్ పట్టుంటే..
టీ20 ప్రపంచకప్ 2026లో ఆతిథ్య భారత్‌పై ఓటమి అనంతరం అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టాప్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం వల్లే తాము ఓటమి పాలయ్యామని చెప్పాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ (84; 49 బంతుల్లో 10×4, 4×6) క్యాచ్ మిస్ చేయడం వల్లే ఓడిపోయామని స్పష్టం చేశాడు. తమ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారని, తమ టాప్ బ్యాటర్ల వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని మోనాంక్ తెలిపాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను శుభమ్ రంజనే అందుకోలేకపోయాడు. వాంఖడే మైదానంలో శనివారం రాత్రి టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 29 పరుగుల తేడాతో ఓడింది.
‘ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ గాయపడటంతో అతడు పూర్తి ఓవర్లు వేయలేకపోయాడు. దాంతో బౌలింగ్ కాంబినేషన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్ లాంటి బలమైన జట్టుతో పోరాడడం మరింత కష్టంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. భారత్ లాంటి పెద్ద జట్టు ఇలాంటి ఒత్తిడిని కూడా తట్టుకుని విజయం సాధించగలిగింది.. అంటే అది అతని ఇన్నింగ్స్ వల్లే. ఈ మ్యాచ్‌ను పూర్తిగా మరిచిపోతాం. ఇకపై మా పూర్తి దృష్టి తదుపరి మ్యాచ్‌పైనే ఉంటుంది. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, వచ్చే మ్యాచ్‌లో మెరుగైన ఆటతో గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని మోనాంక్ పటేల్ చెప్పుకొచ్చాడు. భారత్‌పై పరాజయం ఎదురైనా.. అమెరికా జట్టు ఇచ్చిన పోటీ, మోనాంక్ పటేల్ చూపించిన నిజాయితీ గల విశ్లేషణ క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.