నాలుగో టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం..

నాలుగో టీ20లో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం*

*సిరీస్‌ సమం*

తొలి మూడు టీ20లు టాస్‌ గెలిచిన జట్టువే. ఫీల్డింగ్‌ ఎంచుకోవడం.. ప్రత్యర్థిని కట్టడి చేయడం… మ్యాచ్‌ గెలవడం. ఇదీ వరుస. ఈ నేపథ్యంలో విజయం తప్పనిసరైన మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడిపోవడంతో అభిమానుల్లో కలవరం. కానీ కోహ్లీసేన ట్రెండ్‌ను మార్చేసింది. నాలుగో టీ20లో గట్టిగా పోరాడింది. మొదట బ్యాటింగ్‌ చేసినా.. పైచేయి సాధించింది. సూర్యకుమార్‌, శ్రేయస్‌ మెరుపులతో మొదట కాస్త మెరుగైన స్కోరు సాధించిన భారత్‌.. శార్దూల్‌, హార్దిక్‌ల చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేసింది. సిరీస్‌ ఆశలను నిలబెట్టుకుంది.
కీలక సమరంలో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. గురువారం చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో మొదట భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (37; 18 బంతుల్లో 5×4, 1×6), రిషబ్‌ పంత్‌ (30; 23 బంతుల్లో 4×4) మెరిశారు. ఆర్చర్‌ (4/33) భారత్‌ మరింత స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఛేదనలో ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆ జట్టులో రాయ్‌ (40; 27 బంతుల్లో 6×4, 1×6), స్టోక్స్‌ (46; 23 బంతుల్లో 4×4, 3×6) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్‌ (3/42), హార్దిక్‌ (2/16), రాహుల్‌ చాహర్‌ (2/35) సత్తాచాటారు. నిర్ణయాత్మక చివరి టీ20 శనివారం జరుగుతుంది.
శార్దూల్‌ తిప్పాడు..: భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 10 ఓవర్లకు 71/3తో నిలిచింది. రాయ్‌ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికీ భారత్‌దే పైచేయి. కానీ ఆ తర్వాత పరిస్థితి తలకిందులైంది. స్టోక్స్‌, బెయిర్‌స్టో (25) జోడీ.. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు బాది లక్ష్యాన్ని కరిగించింది. 15వ ఓవర్లో బెయిర్‌స్టో ఔట్‌ కావడంతో భారత్‌కు కాస్త ఉపశమనం దక్కింది. ఇంగ్లాండ్‌ విజయానికి చివరి 4 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన దశలో శార్దూల్‌ మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. వరుస బంతుల్లో స్టోక్స్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ (4)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌ గొప్పగా వేసిన హార్దిక్‌ కేవలం 6 పరుగులే ఇచ్చి సామ్‌ కరన్‌ (3) వికెట్‌ తీశాడు. భువి వేసిన 19వ ఓవర్లో పది పరుగులు రావడంతో చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. శార్దూల్‌ వేసిన ఆ ఓవర్‌లో 14 పరుగులే రావడంతో విజయం భారత్‌ సొంతమైంది.
భగ్గుమన్న సూర్య: భారత్‌ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ బ్యాటింగే హైలైట్‌్. మరోసారి ఓపెనర్లు రోహిత్‌ (12), రాహుల్‌ (14) విఫలమైనప్పటికీ.. అర్ధశతకంతో సూర్య ఆ ప్రభావం పడకుండా చూశాడు. టాస్‌ ఓడి భారత్‌ బ్యాటింగ్‌కు దిగగా.. స్పిన్నర్‌ రషీద్‌ (1/39) వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతినే రోహిత్‌ సిక్స్‌గా మలిచాడు. కానీ ఆర్చర్‌ స్లో డెలీవరీకి బలయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన రాహుల్‌ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు. రోహిత్‌ ఔటయ్యాక అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ కళ్లు చెదిరే సిక్స్‌తో పరుగుల ఖాతా తెరవడం విశేషం. లెగ్‌స్టంప్‌లో పడ్డ షార్ట్‌పిచ్‌ బంతిని ఒక కాలు పైకెత్తి అమాంతం ఫైన్‌లెగ్‌ దిశగా పుల్‌ చేశాడు. అతడితో జోరుతో జట్టు తొలి పవర్‌ప్లే ముగిసే సరికి 45/1తో నిలిచింది. ఆ తర్వాతా సూర్య దూకుడు కొనసాగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రావడంతో సత్తాచాటాలనే కసితో కనిపించిన అతను రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో రాహుల్‌తో పాటు ఫామ్‌లో ఉన్న కోహ్లి (1)ని వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చి.. ప్రత్యర్థి భారత్‌ను దెబ్బకొట్టింది. స్లో డెలీవరీతో రాహుల్‌ను స్టోక్స్‌ (1/26) బుట్టలో వేయగా.. రషీద్‌ గూగ్లీని అర్థం చేసుకోవడంలో విఫలమైన కోహ్లి స్టంపౌటయ్యాడు. ఆ దశలో సూర్యతో పాటు పంత్‌ జాగ్రత్తగా ఆడడంతో స్కోరు వేగం తగ్గింది. 9 నుంచి 11 ఓవర్ల మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడేమో కానీ సూర్య.. రషీద్‌ ఓవర్లో రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌కు ఊపు తేవడమే కాకుండా తన తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని చేరుకున్నాడు. పంత్‌ కూడా ధాటిగా ఆడడంతో 13వ ఓవర్లో జట్టు స్కోరు వంద దాటింది. కరన్‌ (1/16)కు సిక్స్‌తో స్వాగతం పలికిన సూర్య ఇక విధ్వంసం సృష్టిస్తాడనుకుంటే.. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో తక్కువ ఎత్తులో మలన్‌ పట్టిన క్యాచ్‌కు నిష్క్రమించక తప్పలేదు. అయితే క్రీజులోకి రాగానే ఫోర్లతో విరుచుకుపడ్డ శ్రేయస్‌ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. దీంతో 15 ఓవర్లకు జట్టు 128/4తో నిలిచింది. శ్రేయస్‌ క్లాస్‌కు, పంత్‌ దూకుడు తోడవడంతో అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ మరోస్థాయికి చేరుతుందనిపించింది. కానీ ఆర్చర్‌ మరోసారి ఆతిథ్య జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. పంత్‌ను అతను బౌల్డ్‌ చేశాడు. కానీ జోర్డాన్‌ (0/41) వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో హార్దిక్‌ (11) ఓ సిక్స్‌.. శ్రేయస్‌ వరుసగా 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులొచ్చాయి. దీంతో జట్టు స్కోరు 200కు చేరువగా వెళ్తుందేమోనన్న ఆశ కలిగింది. కానీ ఆ తర్వాతి ఓవర్‌ వేసిన మార్క్‌వుడ్‌ (1/25) హార్దిక్‌ వికెట్‌ తీసి కేవలం 7 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో ఆర్చర్‌.. శ్రేయస్‌, సుందర్‌ (4)ను ఔట్‌ చేసినప్పటికీ 11 పరుగులు రావడంతో జట్టు స్కోరు 180 దాటింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) ఆర్చర్‌ 12; కేఎల్‌ రాహుల్‌ (సి) ఆర్చర్‌ (బి) స్టోక్స్‌ 14; సూర్యకుమార్‌ (సి) మలన్‌ (బి) సామ్‌ 57; కోహ్లి (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 1; పంత్‌ (బి) ఆర్చర్‌ 30; శ్రేయస్‌ (సి) మలన్‌ (బి) ఆర్చర్‌ 37; హార్దిక్‌ (సి) స్టోక్స్‌ (బి) మార్క్‌వుడ్‌ 11; శార్దూల్‌ నాటౌట్‌ 10; సుందర్‌ (సి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 4; భువనేశ్వర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-21, 2-63, 3-70, 4-110, 5-144, 6-170, 7-174, 8-179; బౌలింగ్‌: రషీద్‌ 4-1-39-1; ఆర్చర్‌ 4-0-33-4; మార్క్‌వుడ్‌ 4-1-25-1; జోర్డాన్‌ 4-0-41-0; స్టోక్స్‌ 3-0-26-1; సామ్‌ కరన్‌ 1-0-16-1
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 40; బట్లర్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 9; మలన్‌ (బి) చాహర్‌ 14; బెయిర్‌స్టో (సి) సుందర్‌ (బి) చాహర్‌ 25; స్టోక్స్‌ (సి) సూర్యకుమార్‌ (బి) శార్దూల్‌ 46; మోర్గాన్‌ (సి) సుందర్‌ (బి) శార్దూల్‌ 4; సామ్‌ కరన్‌ (బి) హార్దిక్‌ 3; జోర్డాన్‌ (సి) హార్దిక్‌ (బి) శార్దూల్‌ 12; ఆర్చర్‌ నాటౌట్‌ 18; రషీద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 177; వికెట్ల పతనం: 1-15, 2-60, 3-66, 4-131, 5-140, 6-140, 7-153, 8-177; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-1-30-1; హార్దిక్‌ 4-0-16-2; శార్దూల్‌ 4-0-42-3; సుందర్‌ 4-0-52-0; రాహుల్‌ చాహర్‌ 4-0-35-2….

ఆఖర్లో ఉత్కంఠ..

చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌కు 23 పరుగులు అవసరం కావడంతో భారత్‌కు విజయం తేలికే అనిపించింది. కానీ ఉత్కంఠ తప్పలేదు. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఈ ఓవర్‌ రెండు, మూడో బంతుల్లో ఆర్చర్‌ 4, 6 కొట్టి భారత శిబిరంలో కలవరం పుట్టించాడు. దీనికి తోడు తీవ్ర ఒత్తిడికి లోనైన శార్దూల్‌ వరుసగా రెండు వైడ్లు వేయడంతో ఉత్కంఠ తీవ్రమైంది. 3 బంతుల్లో 10 పరుగులు అవసరమైన స్థితిలో నాలుగో బంతికి ఒకే పరుగు ఇచ్చిన శార్దూల్‌.. అయిదో బంతికి జోర్డాన్‌ను ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ పనైపోయింది. చివరి బంతికి ఆర్చర్‌ ఒక్క పరుగూ చేయలేకపోయాడు….