టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేత…

*‘విశ్వవిజేత’ ఇంగ్లండ్ .. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు..*

టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ప్రత్యర్థి పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేధించారు. టార్గెట్ స్వల్పమే అయినా మ్యాచ్‌ను నిలబెట్టుకునేందుకు పాకిస్తాన్ బౌలర్లు విశ్వప్రయత్నం చేశారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌.. అందులోనూ ఛేజింగ్‌లో ఒత్తిడి తట్టుకుని ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 49 బంతుల్లో 52 పరుగులు కొట్టి చివరి వరకూ క్రీజులో నిలబడ్డాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చినా సామ్ కర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ ఒక దశలో పాక్ రేసులోకి వచ్చినట్టు కనిపించింది. కానీ కీలక సమయంలో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయ్యింది. షాషీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ తీయగా.. హారిస్ రౌఫ్ 2 వికెట్లు తీశారు.

ఇంగ్లండ్ బ్యాటింగ్: జాస్ బట్లర్ (26), అలెక్స్ హేల్స్ (1), ఫిలిప్ సాల్ట్ (10), బెన్ స్టోక్స్ (52 నాటౌట్), హ్యారీ బ్రూక్స్ (20), మొయిన్ అలీ (19), లియామ్ లివింగ్ స్టోన్ (1 నాటౌట్) చొప్పున వికెట్లు తీశారు.

తేలిపోయిన పాక్ బ్యాటింగ్..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ తేలిపోయింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కీలక మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు ‘క్యూ’ కట్టారు. షాన్ మసూద్ చేసిన 38 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ అంటే ఏ స్థాయిలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా సామ్ కర్రాన్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కూడా 32 పరుగులకే అడిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. దీంతో.. పాకిస్థాన్ జట్టు 45 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మహ్మద్ హారిస్ 8 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ అయితే డకౌట్‌గా వెనుదిరిగి పాక్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. షాన్ మసూద్ ఒక్కడే 28 బంతుల్లో 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షాదాబ్ ఖాన్ 20 పరుగులు, మహ్మద్ నవాజ్ 5, మహ్మద్ వసీమ్ జూనియర్ 4 పరుగులకే చేతులెత్తేశారు. ఇలా.. పాకిస్థాన్ ఓపెనర్ల నుంచి మిడిలార్డర్ వరకూ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కకావికలమైంది..