టాటాల చేతికి బిస్లరి!

బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు గురువారం ఆయన చెప్పారు. ఈ ప్యాకేజ్డ్‌ వాటర్‌ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) సైతం పోటీపడుతున్నట్టు వివరించారు. బిస్లరి ఇంటర్నేషనల్‌ను కొనేందుకు దాని యాజమాన్యంతో సంప్రదింపుల్లో ఉన్నామని టాటా గ్రూప్‌ కూడా స్టాక్‌ ఎక్సేంజీలకు తెలియజేసింది. 1984లో బిస్లరి ఇంటర్నేషనల్‌ను జయంతీలాల్‌ చౌహాన్‌ ప్రారంభించారు. నిజానికి బిస్లరి సృష్టికర్త ఇటలీ వ్యాపారి ఫెలీస్‌ బిస్లరి. 1969లో ఈ బ్రాండ్‌ను జయంతీలాల్‌ కొనుగోలు చేశారు. ప్రస్తుతం దేశంలో బిస్లరికి 135 ప్లాంట్లున్నాయి. 3వేల మంది పంపిణీదారులున్నారు…దేశీయ శీతల పానీయాల మార్కెట్‌లో ప్రస్తుతం వెలుగొందుతున్న థమ్సప్‌, మాజా, లిమ్కాతోపాటు ఒకప్పుడు విశేష ఆదరణ పొందిన గోల్డ్‌ స్పాట్‌, సిట్రా బ్రాండ్లు చౌహాన్లకు చెందినవే. అయితే మూడు దశాబ్దాల కిందట 1993లో అమెరికా బేవరేజెస్‌ దిగ్గజం కోకా-కోలాకు అమ్మేశారు. ఇప్పుడు థమ్సప్‌ బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా రికార్డులకెక్కగా, 2024 నాటికి మాజా కూడా ఈ ఘనతను సాధిస్తుందన్న ధీమాను కోకా-కోలా వ్యక్తం చేస్తున్నది. నిజానికి 2016లో ‘బిస్లరి పీవోపీ’ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్‌లోకి మళ్లీ చౌహాన్‌ వచ్చినా.. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.