టీడీపీ మాజీ మంత్రి వైసీపీలోకి..!!

టీడీపీ నుంచి ఇప్పటికే కేశినేని నాని వైసీపీలో చేరారు. ఇప్పుడు అమరావతి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి..వైసీపీ అభ్యర్దుల ఎంపిక దాదాపు తుది దశకు చేరింది. ఈ నెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేడర్ తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి మావేశాలు నిర్వహించేందు కు షెడ్యూల్ ఖరారు చేసారు. ఇటు వైసీపీ నుంచి సీట్లు రాని కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నేతలు వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వస్తున్నారు. టీడీపీలో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో రావెల సమావేశమయ్యారు..పార్టీలో దళిత వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా తాను వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రావెల చేరిక పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రావెల కిషోర్ బాబు 2014లో టీడీపీ నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి సారిగా గెలిచినా 2014 లో చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసారు. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ సమయంలో రావెలకు ఉద్వాసన చెప్పారు. ఆ తరువాత కొంత కాలానికే రావెల జనసేనలో చేరారు..2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కిషోర్ బాబుకు 26371 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కు 85,110 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత విజయం సాధించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత అందులో తోట చంద్రశేఖర్ తో పాటుగా రావెల చేరారు. కొంత కాలానికే రావెల ఆ పార్టీ వీడారు. ఇప్పుడు రావెల వైసీపీలో చేరటం ఖాయమని చెబుతున్నారు..