టీడీపీ రెండవ జాబితా..చంద్రబాబు కీలక ప్రకటన…

*అమరావతి.. టీడీపీ(TDP) రెండవ జాబితాను విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు సాయంత్రానికి రెండో జాబితాను ప్రకటిస్తామని మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో బాబు వెల్లడించారు..

మెజారిటీ స్థానాలను ప్రకటిస్తామని చెప్పారు. వీలైనంత వరకు ఎంపీ స్థానాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. దీంతో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కునుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే కూటమిలోని పార్టీలు ఎవరి జాబితాను వారు ప్రకటిస్తారని చంద్రబాబు తెలిపారు.

ఈ మేరకు నిర్వహించిన మీడియాలో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువత ముప్పేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటు కావడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. ప్రజలు గెలవాలంటే, వైకాపా పోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. చేయరాని తప్పులు చేసిన జగన్ తాను ఏకాకినంటున్నాడని అన్నారు. ”రాష్ట్ర హితం కోసమే, పొత్తు పెట్టుకుని ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాం. మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువా, మరొకరు తక్కువ కాదు. సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలి. కష్టపడిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏతో భాగస్వామిగా ఉండటం ఈ నాటిది కాదు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరం. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే లక్ష్యం కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా రాజీపడ్డాం. ఇది సమాజ హితం కోసమే తప్ప స్వార్థం కోసం కాదు. కలిసి నూతన ఒరవడి సృష్టించాలనే పొత్తు పెట్టుకున్నాo. ప్రజలకు మేలు జరగాలంటే, అధికార మార్పు అవసరం. అందుకే రాజ్యాధికారం తప్ప మా కోసం కాదు.” అని అన్నారు.