తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న మోడీ..

తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగే బీజేపీ బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ప్రధాని మోదీ తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తుండడంతో టీబీజేపీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ ఓబీసీ ఆత్మగౌర సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పూర్తిగా కాషాయమయం అయిపోయింది
మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీ.బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది.
సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో మార్పు మొదలైందని.. ఆ మార్పు తుపాన్ ఈ మైదానంలోనే కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఈ సభకు వచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం భారతదేశ చరిత్రలో కొత్త ప్రయోగం అని అభిప్రాయపడ్డారు….

తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యత ఇప్పుడు బీజేపీపైన ఉందని అన్నారు. తెలంగాణలో కమల వికాసానికి అందరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమాత్రం బీసీలను పట్టించుకోవట్లేదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బీసీలది కీలక పాత్ర అని కొనియాడారు. కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని అన్నారు. అంతేకాదు.. పార్లమెంట్‌లో దాదాపు 85 మందికి పైగా బీసీ ఎంపీలు ఉన్నారని వెల్లడించారు. బీసీ వ్యక్తిని అయిన తనను ప్రధానిని చేసింది బీజేపీ, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది బీజేపీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల కంటే తన కుటుంబమే ముఖ్యమని సెటైర్లు వేశారు. ఈ మైదానంలో నుంచే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తనను ప్రధానిని చేసేందుకు పునాది కూడా ఈ మైదానంలోనే పడిందని అన్నారు. గత నా సభలో ప్రసంగం వినేందుకు అభిమానులు టికెట్ కొనుక్కొని లోనికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేరు వేరు కాదని రెండూ ఒకే గూటికి చెందిన పక్షులు అని స్పష్టం చేశారు.

కుల వృత్తుల వారందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ లీడర్లలో అహంకారం కనిపిస్తోందని.. అందరూ మోడీని ఇష్టానుసారం తిడుతున్నారని సీరియస్ అయ్యారు. కుటుంబాల కోసం పనిచేసే పార్టీలు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. తెలంగాణను ఇంతకాలం దోచుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్‌లే అని విమర్శించారు. అభివృద్ధి ఎలాం ఉంటుందని చూపిస్తాం.. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరూ శిక్షార్హులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి ఖచ్చితంగా జైలులో వేస్తామని అన్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీపై ఆరోపణలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ఐదు తరాల భవిష్యత్తును కాంగ్రెస్ నాశనం చేస్తే.. రెండు తరాల భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసిందని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దోషులను వదిలిపెట్టామని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మోడీ స్పందించారు. అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు..

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం లేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఉండేవారు కాదని, మహిళా బిల్లు తెచ్చేవారు కాదన్నారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అని అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినదించారు..