తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ అధిష్టానం
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్.
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఆందోళన కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి.
ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు నియామకం…
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను తెలంగాణ బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీల్లో వివేక్ వెంకట్ స్వామి, రాజగోపాల్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది…
గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షత న బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంకు ముఖ్యఅతిథిగా బిఎల్ సంతోష్, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్లమెంటు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావులు హాజరయ్యారు. వీరితోపాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జిలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన జిల్లా ఇన్ చార్జులు పాల్గొన్నారు. 40 రోజులకు పార్టీ కార్యక్రమాలపై ప్రణాళికల సిద్దం చేయనున్నారు. ఈ క్రమంలో సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్నికల కమిటీలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు…