నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే…..

*నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే…

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రానున్నారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు ఆయన గాంధీభవన్‌కు చేరుకుంటారు.

అనంతరం టిపిసిసి మేనిఫెస్టో కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొన నున్నారు.

సమావేశం అనంతరం ఖర్గే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రాత్రి హైదరాబాద్‌లోనే ఆయన బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగుళూరు వెళ్లనున్నారు.
నేడు 5 నియోజకవర్గాల్లో రాహుల్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

రాహుల్ గాంధీ నేడు ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు రాహుల్ పినపాకకు చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొంటారు. పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేట జరిగి రోడ్ షోలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గాంధీ వరంగల్ ఈస్ట్‌కు చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

అక్కడి నుంచి వరంగల్ వెస్ట్‌కు రాహుల్ గాంధీ వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌కు రాహుల్ గాంధీ వస్తారు. రాజేంద్రనగర్‌లో జరిగే సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు…