తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తోంది. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులకు తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.
ప్రధాన పార్టీల్లో టికెట్‌ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తొలిరోజు 94 నామినేషన్లు నమోదు కాగా.. ఇవాళ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేశారు.1994 నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం తన పాత అంబాసిడర్ కారులో వెళ్లి.. బాన్సువాడ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ వేశారు. నామినేషన్‌కి బయలుదేరే ముందు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 1994 నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచిన పోచారం.. ఈ సారి కూడా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కి చాలా స్థానాల్లో పోటీనే లేదని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. పొంగులేటి తరపున ఆయన సోదరుడు సోదరుడు ప్రసాద్ రెడ్డి.. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. మంథని మండలం కన్నాల గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్ వేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాండూరు ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ సమర్పించారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ రావు.. నామినేషన్ దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ నామినేషన్ వేశారు.

రాజాసింగ్ నామినేషన్..

గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారాయన. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు