తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు…

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో జూపల్లి పర్యటించారు..ఈ సందర్భంగా అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటనష్టపోయిన రైతులకు రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ కాబోతోందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మూత పడబోతోందని అన్నారు. ఇప్పటికే దాదాపు ఖాళీ అయిందని.. మున్ముందు అందరూ వెళ్లిపోయి.. కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని అన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని.. అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుచేశారు..