ఎన్నికల్లో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్…

వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. బీజేపీ సింగిల్‌గానే బరిలో దిగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీచేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అన్నిపార్టీలు కలిసి పోటీచేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. రైతులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని, తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ అని బండి సంజయ్‌ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర వ్యవహరాల సహ ఇంచార్జ్ సునీల్ బన్సల్ మాట్లాడుతూ ఒక బూత్ నుంచి 16 మంది కార్యకర్తలను తీసుకొని కార్యక్రమాలు చేయాలనుకున్నామని చెప్పారు. కార్యకర్తలను గౌరవించుకునే పార్టీ బీజేపీ అని, అందుకే దేశంలో పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఏ ఉద్దేశంతో చేసుకున్నారో అది నేరవేరిందా? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్టు అయిందనే భావన ఏర్పడిందన్నారు. బూత్ లెవల్ కార్యకర్తలు ఇలానే పని చేస్తే ములుగులో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ములుగు లాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని సునీల్ బన్సల్ స్పష్టం చేశారు.

ఆదివారం ములుగులో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ బన్సల్, బండి సంజయ్ పాల్గొన్నారు..