రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి రెవెన్యూ సంఘాలు వినతి..

రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని రెవెన్యూ సంఘాలు కోరాయి. సోమవారం సచివాలయంలో ఆయన్ని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో పలు రెవెన్యూ సంఘాల నాయకులు కలిశారు…ఐదు నెలల వేతన బకాయిలు, గుర్తింపు సంఖ్య కేటాయింపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో వయసు పైబడిన వారు, మృతి చెందిన వారి స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి త్వరగా చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్‌ ఫూల్‌సింగ్ చౌహాన్‌, వీఆర్ఏ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.