?తెలుగు సామెతలు?
*నల్లేరు మీద బండి నడక….*
నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి, ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె , తేనె, వడియాలలో కలిపి వాడుతారు. సిద్ధ వైద్య విధానంలో నల్లేరు విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది, అందుకే దీనికి అస్థిసంహారక (ఎముకలను రక్షించేది) అనే పేరువచ్చింది. బంగ్లాదేశ్ లోని గారో తెగ వారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు.
అప్పడాలలో గూడా దీన్ని వాడుతారు.
పొలాలలో తేమ ఉన్నచోట పిచ్చిగా పెరుగుతుంది.
ఎద్దు బండ్లు నేలమీద నడిచేటప్పుడు ఈ తీగ తేమ చక్రం పట్టాలకు తగిలి తేలికగా బండి నడుస్తుంది.
ఈ తీగ నీళ్ళు లేకున్నా చాలా రోజులు బతకగలదు.
ఏ పనియైనా తేలికగా చేసివేయవచ్చు అనేటప్పుడు
అదెంత ! నల్లేరు మీద బండి నడక— అని అంటూ ఉంటారు.
*సింగి నాదం -జీలకర్ర…*
బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు.
దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి ఊళ్లను దోచుకోవడం సాగించారు.
వీరిని పిండారీలు అని పిలిచేవారు. వీరు పద్దితితో దోచుకోవడానికి వచ్చేటప్పుడు ఒక కొమ్ము బూర ఊదేవారు. (శృంగ నాదం ). ఈ నాదాన్ని విని ఊరి జనం పారిపోయేవాళ్లు. యధేచ్చగా దోపిడి కి అవకాశం కల్పించుకొనేవారు.
ఇది ఇలా ఉండగా, విదేశీ వర్తకులు తమ నావలు ఓడలలో జీలకర్ర లాంటి దినుసులు వేసుకొని అమ్మకం సాగించేవారు వారుకూడా తమ రాకను తెలియచేస్తూ కొమ్ము బూర ఊదేవారు.
కొమ్ము బూర (శృంగ నాదం ) వాడుకలో సింగి నాదం గా మారింది. ఈ జీలకర్ర వ్యాపారుల నాదం పిండారీ దొంగలదని జనం భయపడి పారిపోతూంటే, కొంతమంది పెద్దవాళ్ళు అది వర్తకుల దని, నచ్చచెప్పి వాటిని కొనుగోలుకు వెళ్లేవారు.
అలా వచ్చింది సింగి నాదం -జీలకర్ర. అంటే ఆ సింగినాదం జీలకర్ర వారిది. దొంగల నాదం కాదు అని.
అందుకనే తేలికగా తీసివేసే ఒక భయాన్ని సింగి నాదం -జీలకర్ర లే. ఒక తెలుగు సామెత గా మారింది..
1. ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి,
2. ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారు
3. ఆడవారు అలిగినా అందమే
4. ఇచ్చినమ్మ ఈగ – పుచ్చుకున్నమ్మ పులి
5. ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
6. ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లు
7. ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదు
8. ఉపాయాలున్నవాడు ఊరిమీద బ్రతుకుతాడు
9. ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
10. ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
11. ఉత్త కుండకు ఊపులెక్కువ..